బియ్యం బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు : సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

బియ్యం బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు : సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్, వెలుగు:  బియ్యం ధరలను కృత్రిమంగా పెంచేందుకు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌‌‌‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. నిత్యావసర సరుకుల అక్రమ రవాణా, అక్రమ నిల్వలకు పాల్పడే  రైస్ మిల్లర్లు, హోల్‌‌‌‌సేల్, రిటైల్ వ్యాపారులపై అవసరమైతే పీడీ యాక్ట్   ప్రయోగిస్తామని  హెచ్చరించారు.

ఎల్‌‌‌‌నినో సాకుతో బియ్యం ధరలు కృత్రిమంగా పెంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ పరిస్థితిని నియంత్రించేందుకు సివిల్​ సప్లయ్స్​ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వ్యాపారులు, మిల్లర్ల వద్ద ఉన్న బియ్యం నిల్వలు ఎంత? ఎప్పటి నుంచి నిల్వలు ఉన్నాయి? ధరలు పెరగడానికి అసలు కారణాలేంటి? అనే అంశాలపై అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు.

ధరల పెరుగుదలకు గల కారణాలను గుర్తించి, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.  రానున్న రోజుల్లో బియ్యం ధరలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఆర్‌‌‌‌పీకి మించి అధిక ధరలకు బియ్యం విక్రయించడం, తక్కువ తూకంతో సరుకులు అమ్మడం చట్టరీత్యా నేరమని కమిషనర్ పేర్కొన్నారు. 25 కిలోల బ్యాగ్‌‌‌‌లో 26 కిలోలు ఉన్నట్లు చెప్పి విక్రయించడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి సారించామని తెలిపారు.

అక్రమ నిల్వలతో కృత్రిమ కొరత సృష్టించి, మార్కెట్‌‌‌‌లో ధరలు పెరిగేలా చేసే వారిపై  నిత్యావసర సరుకుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే  వారిపైనా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. అలాంటి వారిని గుర్తించి బైండోవర్ చేయడంతోపాటు, అవసరాన్ని బట్టి పీడీ యాక్ట్ ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.